హైదరాబాద్‌లో ఐటీ కారిడార్‌కు అత్యంత సమీపంలోని భూమి.. ఎకరం ధర దాదాపు రూ.పాతికకోట్లు. మొత్తం ఏడెకరాల భూమి విలువ రూ.150 కోట్లపైమాటే. ఇంతవిలువైన భూమికి రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారు ఎవరనే వివరాలు సక్రమంగా లేకపోవడాన్ని అసరా చేసుకుని మల్కాజిగిరి ఎంపీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్‌రెడ్డి భూదందాకు పాల్పడ్డారు. రెవెన్యూ అధికారుల సహకారంతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అత్యంత విలువైన భూమిని తనతోపాటు, తన సోదరుడి పేరుమీద మ్యుటేషన్ చేయించుకున్నారు. శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలో ఏడెకరాల భూమిని రేవంత్‌రెడ్డి సోదరులు అక్రమమార్గంలో దక్కించుకున్నట్టు రంగారెడ్డి జిల్లా అధికారులు తమ విచారణలో తేల్చారు. దీనిపై ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు నివేదికను అందజేశారు. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన రెవెన్యూ ఉన్నతాధికారులు.. నకిలీ డాక్యుమెంట్లతో మ్యుటేషన్ చేసిన తాసిల్దార్ శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్ చేశారు.
ఎకరం పాతిక కోట్లకు పైగానే..
గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు సమీపంలోని గోపన్‌పల్లి గ్రామంలో ప్రధాన రహదారికి చేరువలో.. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ సెంటర్ వెనుక 127 సర్వేనంబర్ భూమి ఉన్నది. బహిరంగ మార్కెట్‌లో దీనిధర ఎకరం రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు పలుకుతున్నది. గోపన్‌పల్లిలో భూములన్నీ గజాల చొప్పునే క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ఇక్కడ గజం ధర రూ. 85 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది. ఈ ప్రకారం ఈ ఏడెకరాల విలువ బహిరంగమార్కెట్‌లో దాదాపు రూ.150 కోట్లకు పైగానే ఉంటుంది.
నకిలీ డాక్యుమెంట్లతో..
గోపనపల్లిలోని సర్వేనంబరు 127లో 10.21 ఎకరాల భూమి ఉన్నది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఈ భూమి క్రయవిక్రయాలు జరిగినట్టు కొందరు కోర్టును ఆశ్రయించారు. సర్వేనంబర్ 127లోని భూమిలో తమకు హక్కుఉన్నదని, రేవంత్‌రెడ్డి ఆ భూములను అమ్ముకోకుండా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ కొల్లా అరుణ 2017లో హైకోర్టులో 17542,17637 నంబర్లతో రిట్‌పిటిషన్ వేశారు. అలాగే అనుముల కొండల్‌రెడ్డి ఈ భూములు అమ్ముకోకుండా ఆదేశాలు జారీచేయాలని అనిల్‌కుమార్ అనేవ్యక్తి 2015లో రంగారెడ్డి జిల్లా సివిల్ కోర్టులో 780/2015 నంబర్‌తో పిటిషన్ దాఖలుచేశారు. వీటిపై నిజానిజాలు తెలుసుకునేందుకు అధికారులు విచారణ చేపట్టారు. నకిలీ డాక్యుమెంట్ల ద్వారా ముందుగా ఈ భూమిని వేరేవారి పేరుమీద రాయించి.
తర్వాత వారినుంచి రేవంత్‌రెడ్డి, అతడి సోదరుడు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. 6 ఎకరాల 39.5 గుంటలను ఎంపీ రేవంత్‌రెడ్డి, సోదరుడు కొండల్‌రెడ్డి తమపేరు మీద రాయించుకున్నట్టు తేల్చారు. 2.20 ఎకరాలను కళావతి నుంచి అనుముల కొండల్‌రెడ్డి పేరుమీద.. అలీసలీమ్ బిన్, హబీబ్ అబ్దుల్హ్రీమ్, ఈ లక్ష్మయ్య, ఏ వెంకట్రావు నుంచి 1 ఎకరం 29.5 గుంటలు,13.5 గుంటలు, అలీసలీమ్ బిన్, హబీబ్ అబ్దుల్ రహీమ్, ఏ వెంకట్రావు అండ్ అదర్స్ నుంచి 1.24 ఎకరాలు, ఈ లక్ష్మయ్య నుంచి 31.5 గుంటలను అనుముల రేవంత్‌రెడ్డి పేరుమీద రెవెన్యూ అధికారులు వివిధ మ్యుటేషన్ల ద్వారా బదిలీచేసి ప్రొసీడింగ్స్ ఇచ్చినట్టు విచారణలో తేలింది. నకిలీ డాక్యుమెంట్ల ద్వారానే ఈ మ్యుటేషన్లు జరిగినట్టు అధికారులు నిర్ధారించారు. 127 సర్వేనంబర్‌లోని భూమికి నకిలీ డాక్యుమెంట్లతో మ్యుటేషన్లు చేయడంతోపాటు, రికార్డుల్లో తప్పుగా నమోదు చేసిన నాటి శేరిలింగంపల్లి తాసిల్దార్ శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లాకలెక్టర్.. రాష్ట్ర ప్రభుత్వప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు నివేదిక పంపించారు. దీంతో డిప్యూటీ కలెక్టర్/తాసిల్దార్ డీ శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
పట్టాదారులేడని పక్కా ప్లాన్..
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలోని సర్వేనంబర్ 127లో 10.21 ఎకరాల భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డులు ఎక్కడా సక్రమంగా లేవు. 1977 వరకు ఈ భూమి వడ్డె హనుమ, ఆయన వారసుడు వడ్డె మల్లయ్య పేరుమీద ఉన్నట్లు రికార్డుల్లో నమోదై ఉన్నది. 1978 నుంచి పహాణీలో మల్లయ్య పేరుమీద నమోదవుతూ వచ్చింది. మల్లయ్య పేరు ఉన్నప్పటికీ.. ఆయన ఇంటిపేరు మాత్రం లేదు. 1993-94 నుంచి మల్లయ్యపేరు వద్ద.. దబ్బ మల్లయ్య అని రికార్డుల్లో ఎంటరయింది. అయితే, ఈ పేరును ఎక్కించడానికి ఎలాంటి ఆధారాలు మాత్రం లేవు. 2001-02 నుంచి పహాణీల్లో దబ్బ మల్లయ్య పేరు కూడా కన్పించకుండాపోయింది.
2005లో అప్పటి శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్/తాసిల్దార్ ఈ మల్లయ్యకు వారసుడిగా పేర్కొంటూ ఈ లక్ష్మయ్య పేరుమీద 2. 21 ఎకరాలు రాసి.. కాస్తులో ఉన్నట్టు పేర్కొన్నారు. అదే తాసిల్దార్ ఆ వివరాలను సవరిస్తూ.. లక్ష్మయ్య 31 గుంటల్లో మాత్రమే కాస్తులో ఉన్నట్టు రాశారు. లక్ష్మయ్య పేరుమీద ముందుగా 2.21 ఎకరాలను రాయడం, మళ్లీ సవరించి 31 గుంటలకు మార్చడం రెండూ తాసిల్దార్ తన అధికార పరిధిని అతిక్రమించే చేశారు.
అక్రమంగా లక్ష్మయ్య పేరుమీద రికార్డుల్లో నమోదయిన 31 గుంటల భూమిని అనుముల రేవంత్‌రెడ్డి కొనుగోలు చేసినట్టు సేల్ డీడ్ తయారుచేశారు. ఈ లక్ష్మయ్యకు ఎలాంటి పట్టదారుహక్కులు లేనప్పటికీ.. అతడి నుంచి భూమిని కొనుగోలుచేసినట్టు తాసిల్దార్.. రేవంత్‌రెడ్డికి అనుకూలంగా వ్యవహరించినట్టు తెలుస్తున్నది.
ఎలాంటి ఆధారాలు లేకున్నప్పటికీ తనపేరు మీదఉన్న డాక్యుమెంట్ల ద్వారా డీ మల్లయ్య 2.20 ఎకరాలను కళావతికి అమ్మాడు. రెవెన్యూ అధికారులు కళావతి పేరుమీద మ్యుటేషన్ చేయగా.. తర్వాత ఆమె అదే భూమిని ఏ కొండల్‌రెడ్డి పేరు మీదకు బదిలీచేశారు.
1989లో ఏ వెంకటరెడ్డి అనేవ్యక్తి దబ్బ మల్లయ్య నుంచి ఎకరం పదిన్నర గుంటల భూమి కొనుగోలు చేసినట్టు రికార్డుల్లో నమోదయింది. అయితే నాటికి దబ్బ మల్లయ్య పేరుమీద భూమి ఉన్నట్టు రికార్డుల్లో లేదు. వెంకట్రావు అనేవ్యక్తి ఈ భూమిలోని పదమూడున్నర గుంటల భూమిని తర్వాత ఏ కొండల్‌రెడ్డి పేరు మీదకు బదలాయించారు. ఇదిలా ఉండగా గోపన్‌పల్లిలోని సర్వేనంబర్ 127లో గల భూమికి హక్కుదారులెవరు అనే విషయంలో స్పష్టత లేదని అధికారులు తమ విచారణలో తేల్చారు.