అంబానీపై ప్రశంసలు కురిపించిన ట్రంప్.. మీరు గొప్ప పని చేశారంటూ..

న్యూఢిల్లీ: అమెరికా మార్కెట్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని భారత పారిశ్రామిక ప్రతినిధులను ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోరారు. వారి ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే విదేశీ పెట్టుబడులకు నిబంధనలను మరింత సడలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ‘‘మీ అందరికీ నా ధన్యవాదాలు. మీరు సాధించిన విజయాలకు నా అభినందనలు. మీరంతా అమెరికా మార్కెట్లో మరిన్ని పెట్టుబడులు పెడతారని ఆశిస్తున్నా. నేను వాటిని పెట్టుబడులుగా కాకుండా మా మార్కెట్లో మీరు కల్పించబోయే ఉద్యోగాలుగా చూస్తా’’నని ట్రంప్‌ పేర్కొన్నారు. 


 


ఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయంలో మంగళవారం ట్రంప్‌తో భారత కార్పొరేట్‌ సారథుల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ, మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌, ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లా తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. 


 


అమెరికా మార్కెట్లో తమ కంపెనీలు కొనసాగిస్తున్న వ్యాపారాలు, ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడులపై భారత కార్పొరేట్‌ ప్రముఖులు ఈ సందర్భంగా ట్రంప్‌కు తెలియజేశారు. అయితే, నియంత్రణపరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తపరిచారు. ఇందుకు ట్రంప్‌ స్పందిస్తూ.. ‘‘చట్టబద్ధమైన ప్రక్రియలో భాగంగా మీరు కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అయితే, చాలా నిబంధనలను సడలిస్తున్నాం. త్వరలోనే మీరు మార్పు గమనిస్తారు. పరిస్థితి మరింత మెరుగుపడనుంద’’న్నారు. అమెరికా, భారత కంపెనీలు ఒకరి దేశంలో మరొకరు పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని ట్రంప్‌ అన్నారు. 


 


అంబానీ.. భేష్‌!


రిలయన్స్‌ ఇండస్ట్రీ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) చైర్మన్‌ ముకేశ్‌ అంబానీని ట్రంప్‌ ప్రశంసించారు. 4జీ సేవలతో భారత టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు తెరలేపడంతోపాటు అమెరికా ఇంధన రంగంలో వ్యూహాత్మక పెట్టుబడులకు గాను ఆయన్ని అభినందించారు. ‘‘మీరు గొప్ప పని చేశారు. ధన్యవాదాలు’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. వారి దేశంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు. ట్రంప్‌, అంబానీ మధ్య పలు అంశాలపై జరిగిన సంభాషణ.. 


 


అంబానీ: అమెరికా ఇంధన రంగంలో ఇప్పటివరకు 700 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాం.


ట్రంప్‌: 700 కోట్ల డాలర్లంటే చాలా పెద్ద మొత్తం.


ట్రంప్‌: ప్రస్తుతం 4జీ సేవలందిస్తున్నారు. మరి 5జీ సేవలూ అందిస్తారా..? 


అంబానీ:  చైనా యంత్ర పరికరాల తయారీదారు సాయం లేకుండా ప్రపంచంలో టెలికాం సేవలందిస్తున్న ఏకైక సంస్థ రిలయన్స్‌ జియోనే. 


ట్రంప్‌: మంచిది. అలాగే కొనసాగించండి. 


అంబానీ: మీరు పన్నులు తగ్గించడంతో అమెరికా పెట్టుబడులకు మరింత ఆకర్షణీయంగా మారింది. మీ విధానాల ప్రభావంతో మా దేశంలోనూ కార్పొరేట్‌ పన్ను తగ్గించారు. 


ట్రంప్‌: ఈ విషయంలో భారత్‌ అమెరికా బాటను అనుసరించింది.


 


పరిమిత వాణిజ్య ఒప్పందానికి తుది రూపం: గోయల్‌ 


అమెరికా- భారత్‌ మధ్య పరిమిత వాణిజ్య ఒప్పందం తుది రూపం దిద్దుకుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. మున్ముందు సమగ్ర వాణిజ్య ఒప్పందంపై ఇరు వర్గాలు కసరత్తు చేయనున్నట్లు ఆయన చెప్పారు.