‘అ!’ సినిమాతో నిర్మాతగా తొలి ప్రయత్నంలోనే కమర్షియల్ సక్సెస్‌తో పాటు జాతీయ పురస్కారాల్ని అందుకున్నారు నాని. ఈ సినిమా తర్వాత నాని ఎలాంటి చిత్రాన్ని నిర్మిస్తాడో అని సినీ వర్గాలతో పాటు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. తొలి సినిమాకు పూర్తి భిన్నంగా క్రైమ్ థ్రిల్లర్ కథను ఎంచుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. శైలేష్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ చిత్రానికి ‘హిట్' అనే టైటిల్ పెట్టడం ఆసక్తిని కలిగించింది. ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్‌నుమాదాస్' చిత్రాలతో యువతరం ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న విష్వక్‌సేన్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. ‘హిట్' టైటిల్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచిందా? నిర్మాతగా నాని మరో విజయాన్ని అందుకున్నాడా? లేదా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే...
విక్రమ్ రుద్రరాజు(విష్వక్‌సేన్) తెలివితేటలున్న పోలీస్ అధికారి. ఎలాంటి క్లిష్టమైన కేసునైనా క్షణాల్లో పరిష్కరిస్తుంటాడు. హోమీసైడ్ ఇంటర్‌వెన్షన్ టీమ్(హిట్) పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విభాగంలో పనిచేస్తుంటాడు. ఫోరెన్సిక్ విభాగంలో పనిచేసే నేహాను(రుహానీశర్మ) ప్రేమిస్తుంటాడు. గతం తాలూకు చేదు జ్ఞాపకాల ప్రతిక్షణం విక్రమ్‌ను వెంటాడుతుంటాయి. వాటి వల్ల అతడి ప్రాణాలకు ప్రమాదమని డాక్టర్లు హెచ్చరిస్తారు. నేహా కోరిక మేరకు ఆరు నెలలు ఉద్యోగానికి సెలవు పెడతాడు విక్రమ్. హఠాత్తుగా ఓ రోజు నేహా కనిపించడం లేదని అతడికి ఫోన్ వస్తుంది. నేహా కనిపించకుండా పోయిన మాదిరిగానే ప్రీతి అనే అమ్మాయి మిస్సింగ్ అవుతుంది. ప్రీతీ ఏమైందో తెలిస్తేనే నేహా అచూకీ లభ్యమయ్యే పరిస్థితి తలెత్తుతుంది. వారిద్దరి మిస్సింగ్ వెనకున్న చిక్కుముడిని విక్రమ్ ఎలా ఛేదించాడు? నేహా ప్రాణాలను కాపాడగలిగాడా?లేదా?అన్నదే ఈ చిత్ర కథ.
క్రైమ్ థ్రిల్లర్ కథలన్నీ నేరాలు జరిగే తీరు, పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్ అంశాల చుట్టూనే తిరుతుగుంటాయి. చివరకు అసలైన నేరస్తుడిని పోలీసులు పట్టుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది. హిట్ అదే సరళిలో సాగుతుంది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేని ఇద్దరూ అమ్మాయిల మిస్సింగ్ కేసును ఓ పోలీస్ అధికారి ఎలా ఛేదించాడనే పాయింట్‌తో దర్శకుడు ఈసినిమాను తెరకెక్కించారు. వాస్తవ ఘటనల స్ఫూర్తితో కథను రాసుకున్న దర్శకుడు సహజత్వానికి దగ్గరగా సినిమాను నడిపించారు. నేరాన్వేషణలో పోలీసుల ఇంటరాగేషన్ ఎలా ఉంటుందో, అనుమానితుల నుంచి నిజాల్ని చెప్పించడానికి వారు చేసే ప్రయత్నాలేమిటో అంతర్గతంగా పోలీస్ కార్యాలయాల్లో ఏం జరుగుతుందో, పోలీసులపై ఉండే ఒత్తిడి ఏమిటో అనే అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తూ దర్శకుడు కథ, కథనాల్ని రాసుకున్నాడు. ఇన్వెస్టిగేషన్‌లో పోలీసులు ఆలోచించే తీరు ఎలా ఉంటుందో వాస్తవ కోణంలో చూపించారు.
తన తెలివితేటలతో క్షణాల్లోనే కేసులను సాల్వ్ చేసే సన్నివేశాలతో హీరో పాత్రను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత నేహామిస్సింగ్ కావడంతోనే అసలు కథ మొదలువుతుంది. ఆమె కోసం విక్రమ్ చేసే ఇన్వెస్టిగేషన్ చుట్టూనే కథను మొత్తం నడిపించారు. ప్రీతీ తల్లిదండ్రులతో పాటు స్నేహితురాలు హరితేజలపై అనుమానాలు రేకెత్తడం, నిజానిజాలేమిటో తెలుసుకోవడం కోసం విక్రమ్ పడే సంఘర్షణ, ఎంత ప్రయత్నించిన ఎలాంటి ఆధారాలు దొరక్క అతడు ఎదుర్కొనే సంఘర్షణతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఓ చిన్న క్లూతో అసలైన హంతకుడిని విక్రమ్ ఎలా పట్టుకున్నాడనేది థ్రిల్‌ను కలిగిస్తుంది. ఆ నేరం చేసిందెవరూ? అందుకు ప్రేరేపించిన అంశాలతో వచ్చే మలుపు ఆసక్తిని పంచుతుంది.
క్రైమ్ థ్రిల్లర్ కథల్ని సాగతీత ధోరణి లేకుండా ఆద్యంతం తర్వాత ఏం జరగబోతుందోననే ఉత్కంఠను రేకెత్తిస్తూ నడిపించడం ముఖ్యం. దర్శకుడు శైలేష్‌కు తొలి సినిమానే ఆ ప్రయత్నంలో కొంత మేర సఫలమయ్యారు. నేరాన్వేషణలో పోలీసుల సాక్ష్యాల సేకరణ ఎలా ఉంటుంది, పాలిగ్రామ్, నార్కోటిక్ టెస్టులతో ఎలా నిజాల్ని చెప్పిసారనే అంశాల్ని సినిమాలో కొత్తగా చూపించారు. అయితే అవన్నీ నిధానంగా సాగడం మైనస్‌గా మారింది. నేరాన్వేషణలో కావాల్సినంత ఉత్కంఠ లోపించింది. ఎంతో తెలివిపరుడైన పోలీస్ అయినా అనుక్షణం తన వెనుకే తిరిగే నేరస్తుడిని పట్టుకోకపోవడం ఏమిటో అంతుచిక్కదు. గత జ్ఞాపకాల కారణంగా హీరో సమస్యను ఎదుర్కొంటుంటాడని దర్శకుడు చూపిస్తుంటారు. కీలకమైన ఆ పాయింట్‌ను అస్పష్టంగానే వదిలేశారు దర్శకుడు. నాయకానాయికల మధ్య ప్రేమకథను అంతర్లీనంగా చూపించాలని ప్రయత్నించారు. అది సరిగా కుదరలేదు. ఇలా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి.
ఉద్యోగబాధ్యతలతో పాటు ప్రియురాలి క్షేమం కోసం అనుక్షణం తపనపడే పోలీస్ అధికారిగా విష్వక్‌సేన్ విభిన్నంగా కనిపించారు. మాస్ ఛాయలతో సాగుతూనే సెటిల్డ్‌గా అతడి పాత్రను దర్శకుడు తీర్చిదిద్దారు. గత సినిమాలకు భిన్నంగా కనిపించారు. అతడి పాత్ర చుట్టూనే సినిమా మొత్తం తిరుగుతుంది. రుహానీశర్మ నటనను ప్రదర్శించడానికి అవకాశం రాలేదు. విక్రమ్ స్నేహితుడిగా రోహిత్ పాత్రధారి సహజంగా నటించాడు. మురళీశర్మ, భానుచందర్‌లవి చిన్న పాత్రలైనా తమ అనుభవంతో వాటిలో ఒదిగిపోయారు.
దర్శకుడిగా శేలేష్ రాసుకున్న కథలో ఎలాంటి కొత్తదనం లేదు. ఇదివరకు ఈ పాయింట్‌తో ‘క్షణం’తో పాటు తెలుగు తెరపై చాలా సినిమాలు వచ్చాయి. వాటి ఛాయలతోనే ఈ సినిమా సాగింది. నిజాయితీగా తాను చెప్పాలనుకున్న అంశాన్ని తెరపై ఆవిష్కరించారు. చిన్న సినిమా అయినా దర్శకుడి విజన్‌ను నమ్మి అత్యున్నత ప్రమాణాలతో నాని, ప్రశాంతి తిపిరినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. క్రైమ్ థ్రిల్లర్ ఫీల్‌ను తక్కువ లైటింగ్‌తో చక్కగాచూపించారు ఛాయాగ్రహకుడు మణికందన్. వివేక్‌సాగర్ నేపథ్య సంగీతం బాగుంది.
రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. నవ్యతను ఆశించి థియేటర్‌లో అడుగుపెట్టిన వారిని కొంత నిరాశ పరుస్తుంది. ఈ సెటప్ జోనర్‌లో తెరకెక్కిన సినిమాలు కొన్ని వర్గాల వారికే చేరువ అవుతుంటాయి. ఆ ప్రేక్షకుల ఆదరణపైనే ఈ సినిమా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
రేటింగ్: 3/5