- ఈశాన్య ఢిల్లీలో యుద్ధానంతర పరిస్థితులు
- ప్రభావిత ప్రాంతాల్లో ఇండ్లకే పరిమితమైన ప్రజలు
- నగరం విడిచి వెళ్తున్న అనేక కుటుంబాలు.. 38కి పెరిగిన మృతులు
- ‘విద్యేష వ్యాఖ్యల’పై కేంద్రానికి కోర్టు నోటీసులు
దేశ రాజధాని శిథిల నగరంగా మారింది. మత ఘర్షణలు కాస్త తగ్గుముఖం పట్టినా.. ప్రభావిత ప్రాంతాల్లో శ్మశాన వైరాగ్యం రాజ్యమేలుతున్నది. ఈశాన్య ఢిల్లీలో ఏ వీధిలో చూసినా బూడిదకుప్పగా మారిన వాహనాలు, ధ్వంసమైన దుకాణాలు.. ఇలా యుద్ధానంతర పరిస్థితులను గుర్తుకు తెస్తున్నది. జీవనోపాధి కోల్పోవడం, భయానక పరిస్థితుల నేపథ్యంలో అనేక కుటుంబాలు నగరాన్ని విడిచి వెళ్తున్నాయి. గురువారం అత్యధిక శాతం ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. కొన్ని చోట్ల హిందువులు, ముస్లింలు ఐక్యంగా రోడ్లమీదికి వచ్చి శాంతియుత ర్యాలీలు నిర్వహించారు. మరోవైపు రాళ్లదాడిలో గాయపడి దవాఖానల్లో చికిత్సపొందుతున్నవారిలో గురువారం మరో 11మంది దుర్మరణం చెందారు. దీంతో మృతుల సంఖ్య 38కి పెరిగింది. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నది. యుమునావిహార్ ప్రాంతంలో సాయంత్రం 4 గంటలకు కొన్ని అల్లరిమూకలు స్వైరవిహారం చేస్తూ.. పలు వాహనాలకు నిప్పు పెట్టాయి. హింస నేపథ్యంలో 10, 12 తరగతులకు గురు, శుక్రవారాల్లో జరుగాల్సిన పరీక్షలను సీబీఎస్‌ఈ వాయిదా వేసింది.
క్రమంగా అదుపులోకి..
ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం భారీగా భద్రతా బలగాలను మోహరించింది. పోలీసులు, పారా మిలిటరీ సిబ్బంది నగర వీధుల్లో కవాతు నిర్వహించారు. పరిస్థితి క్రమంగా అదుపులోకి వస్తున్నదని ప్రత్యేక కమిషనర్ ఎస్‌ఎన్ శ్రీవాత్సవ తెలిపారు. హింసపై సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు రెండు ‘ప్రత్యేక దర్యాప్తు బృందాలను’ (సిట్) ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 48 ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేశామని, 130 మందిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఇరువర్గాలకు చెందిన అల్లరిమూకలు వాట్సప్ గ్రూప్‌ల్లో చర్చించుకొని ప్లాన్ ప్రకారం హింసకు పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
ప్రతివాదిగా కేంద్రం
విద్వేష వ్యాఖ్యలు చేసిన ముగ్గురు బీజేపీ నేతలపై (కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్, పర్వేశ్ వర్మ) ఎఫ్‌ఐఆర్ నమోదుచేయాలంటూ దాఖలైన పిటిషన్ మీద ఢిల్లీ హైకోర్టు గురువారం కూడా విచారించింది. ఢిల్లీలో శాంతిభద్రతలు కేంద్రం పరిధిలోని అంశమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి తెలిపారు. దీంతో కోర్టు.. ఈ కేసులో కేంద్రాన్ని ప్రతివాదిగా చేర్చేందుకు అంగీకరించింది. మూడు వారాల్లోగా స్పందన తెలియజేయాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ బృందం
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసింది. హోంమంత్రిగా అమిత్ షా పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించింది. రాజీనామా చేయాల్సిందిగా ఆయనను ఆదేశించాలని రాష్ట్రపతిని కోరింది. కేంద్ర ప్రభుత్వం రాజ ధర్మాన్ని పాటించేలా చూడాలని విన్నవించింది.
మావాళ్లుంటే రెట్టింపు శిక్ష: కేజ్రీవాల్
హింస కారకులను కఠినంగా శిక్షించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. నిందితుల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్)వారు ఉంటే రెట్టింపు శిక్ష వేయాలని సూచించారు. హింసలో ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ పాత్ర ఉన్నదన్న ఆరోపణల నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడినవారికి రూ.2 లక్షలు చొప్పున పరిహారం.. ఇండ్లు పూర్తిగా ధ్వంసమైతే రూ.5 లక్షలు, పాక్షికంగా ధ్వంసమైతే రూ.2.5 లక్షలు చెల్లిస్తామన్నారు. మరోవైపు కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ఆప్ వర్గాలు తెలి పాయి. ఆయనపై పోలీస్ విచారణ ముగిసే వరకు ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసినట్టు చెప్పాయి. ఐబీ అధికారి అంకిత్ తండ్రి ఫిర్యా దు మేరకు పోలీసులు తాహిర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హింసను ఖండించిన అమెరికా సంస్థ
ఢిల్లీలో హింసపై అమెరికాకు చెందిన కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం ఆందోళన వ్యక్తం చేసింది. ముస్లింలు, ఇతర వర్గాల ప్రజలకు రక్షణ కల్పించాలని మోదీ ప్రభుత్వా న్ని కోరింది. అయితే ఈ విషయాన్ని అనవసరంగా రాజకీయం చేస్తున్నారని భారత విదేశాంగ శాఖ విమర్శించింది.
ఆప్ నేత ఇంట్లో పెట్రోల్ బాంబులు, యాసిడ్‌ప్యాకెట్లు
చాంద్‌బాగ్‌లోని ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ ఇంటిపై భారీగా పెట్రోల్ బాంబులు, యాసిడ్ ప్యాకె ట్లు లభ్యమయ్యాయి. పోలీసులు ఆయనకు చెందిన ఓ పరిశ్రమను కూడా సీజ్ చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్‌శర్మ హత్య లో తాహిర్ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే ఇవన్నీ నిరాధార ఆరోపణలని ఆయన చెప్తున్నారు. అల్లర్ల నేపథ్యంలో తాను కుటుంబంతో కలిసి సోమవారమే ఇంటిని ఖాళీ చేశానన్నారు.