జ‌య‌ల‌లిత‌గా కంగ‌నా.. న్యూ లుక్ విడుద‌ల‌

పురుచ్చిత‌లైవీ  జయలలిత జీవితంగా ఆధారంగా ‘తలైవి’  పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  ఏ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో విడుద‌ల చేయ‌నున్నారు. చిత్రంలో ఎమ్‌జీఆర్‌గా అరవింద స్వామి నటిస్తుండ‌గా, శోభ‌న్‌బాబుగా  బెంగాలీ న‌టుడు జిషు సేన్ గుప్తా న‌టిస్తున్నాడు. జ‌య‌ల‌లిత జీవిత నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ప‌లు సినిమాలు తెర‌కెక్కుతున్న‌ప్ప‌టికీ, త‌లైవా చిత్రంపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.


ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న త‌లైవీ  సినిమాలో జయలలిత ఎలా టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.. ఆ తర్వాత తమిళ రాజకీయాల్లో శక్తిమంతమైన నాయకురాలిగా ఎలా మారింద‌నే విష‌యాలు ఆస‌క్తిక‌రంగా చూపించ‌నున్నారు.  కాగా ఈ సినిమాలో కంగన పాత్రకు సంబంధించి ప‌లు లుక్స్ విడుద‌ల కాగా, వాటికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సోమ‌వారం జయలలిత 72వ జయంతి సందర్భంగా  మరో లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. యంగ్ ఏజ్‌లో జ‌య‌ల‌లిత ఎలా ఉందో, కంగ‌నా లుక్ కూడా అలానే ఉండ‌డం ప్రాధాన్య‌త‌ని సంత‌రించుకుంది.  ఈ సినిమాను విష్ణు వర్ధన్‌ ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌తో కలిసి విబ్రీ మోషన్‌ పిక్చర్స్‌, కర్మ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ నిర్మిస్తున్నారు. జూన్‌ 26న సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్రబృందం.