ఆనాడు జగన్ చెప్పింది వాస్తవం కాదా? -వంగవీటి రాధా

టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ రాజధాని గ్రామాల్లో పర్యటించి దీక్ష చేస్తున్న రైతులు, మహిళలకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు నిరాశ చెందకుండా రాజధాని కోసం న్యాయం పోరాటం చేస్తున్నారన్నారు. రైతులు ఒక పార్టీకో, వర్గానికో భూములు ఇవ్వలేదని...రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చారని వంగవీటి తెలిపారు. ఆనాడు జగన్ కూడా 30వేల ఎకరాలు కావాలని చెప్పింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మంత్రులు రైతులను అవమానించేలా మాట్లాడుతున్నారని... పెయిడ్ ఆర్టిస్ట్‌లు అని నోటికొచ్చినట్లు దూషిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే సామాజిక వర్గం ఉంటే ఇక్కడ రెండు నియోజకవర్గాలలో వైసీపీ ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. నేను విన్నాను, నేను ఉన్నాను అన్న జగన్‌కు మహిళల బాధ వినిపించడం లేదా అని ప్రశ్నించారు. అమరావతి సాధించే వరకు పోరాటం ఆగదని వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు.