పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక, అనుకూల ఆందోళనలతో మొదలైన హింసాకాండ మరింత ముదిరి ఢిల్లీని రావణకాష్టంగా మార్చింది. సీఏఏ నిరసనలతో మొదలైన ఆందోళనలు.. మత ఘర్షణల స్థాయి రూపును సంతరించుకొని మంగళవారం తీవ్రరూపం దాల్చాయి. ఈ ఘటనల్లో మరణించిన వారి సంఖ్య పదమూడుకు చేరింది. 200 మందికి పైగా గాయాలయ్యాయి. ఒకవైపు దుకాణాల విధ్వంసం, మరోవైపు వీధుల్లో దుండగుల వీరంగం.. ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్, మౌజ్‌పూర్ తదితర ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు మంగళవారం కూడా కొనసాగాయి. ఉద్రిక్తతలు ప్రారంభమైన మౌజ్‌పూర్‌లో కొందరు అల్లరి మూకలు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ.. తమ దారికి అడ్డొచ్చిన పండ్ల బండ్లు, రిక్షాలకు నిప్పు పెట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నగరంలో ఉన్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రాళ్లు, రాడ్లు, కత్తులను చేబూని.. హెల్మెట్లను ధరించి బీభత్సం సృష్టిస్తున్న అల్లరి మూకల్ని చెదరగొట్టేందుకు భాష్పవాయు గోళాల్ని ప్రయోగించారు. జాఫ్రాబాద్, మౌజ్‌పూర్, చాంద్‌బాగ్, ఖురేజీ ఖాస్, భజన్‌పుర తదితర ప్రాంతాల్లో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో మొత్తం 13 మంది చనిపోయినట్టు మంగళవారం పోలీసులు తెలిపారు. వీరిలో ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు.
మరో 200 మందికి పైగా గాయాలయ్యాయని, వీరిలో సగం మందికి బుల్లెట్ గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. దాడుల్లో గాయాలపాలైన బాధితుల్ని దవాఖానలకు తీసుకొస్తున్న ఆంబులెన్సులను కూడా దుండగులు అడ్డుకున్నారని, దీంతో పలువురు క్షతగాత్రుల్ని ద్విచక్ర వాహనాలు, వ్యానుల్లో తరలించినట్టు అధికారులు తెలిపారు. మీడియా ప్రతినిధులపై కూడా అల్లరి మూకలు దాడులకు పాల్పడ్డాయి. దీంతో జేకే 24X7 మీడియా సంస్థకు చెందిన ప్రతినిధి, ఎన్డీటీవీకి చెందిన ఇద్దరు ప్రతినిధులు గాయపడ్డారు. ఈశాన్య ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించింది. హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ పోలీసు కమిషనర్ అమూల్య పట్నాయక్‌తో పాటు పలువురు రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉద్రిక్త ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి అన్ని రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు చేయి చేయి కలుపాలని సమావేశంలో నిర్ణయించారు. మరోవైపు, ఢిల్లీ ఘటనల నేపథ్యంలో ఎవరూ వదంతులను ప్రచారం చేయొద్దని.. శాంతి భద్రతలకు సహకరించాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
వెయ్యి మంది పోలీసుల మోహరింపు
తగినంత పోలీసు సిబ్బంది అందుబాటులో లేకపోవడంతోనే ఈశాన్య ఢిల్లీలో రేగిన హింసాత్మక ఘటనలను వెంటనే అదుపు చేయలేకపోయామని ఢిల్లీ పోలీసు కమిషనర్ అమూల్య పట్నాయక్ తెలిపారు. మరోవైపు, దాదాపు వెయ్యి మంది పోలీసులతో కూడిన ఓ బెటాలియన్‌ను ఉద్రిక్త ప్రాంతాల్లో మోహరించామని మరో అధికారి తెలిపారు.
నగరంలోకి రానివ్వొద్దు
బయటి శక్తులు నగరంలోకి రాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ముఖ్మమంత్రి కేజ్రీవాల్ అధికారులను ఆదేశించారు. అన్ని సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయని, ప్రజలు హింసాత్మక ఘటనలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. 1984లో సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్ల తర్వాత.. ఆ స్థాయి హింసాత్మక పరిస్థితులను మళ్లీ ఇప్పుడే చూస్తున్నామని పలువురు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.