శాస్త్ర సాంకేతిక రంగం వైపుగా అడుగులు వేస్తున్న గిరి రైతులు- పాడేరు శాసనసభ్యురాలు భాగ్యలక్ష్మి.

చింతపల్లి వాస్తవనయనమ్: ఉన్నత పర్వత శ్రేణి మరియు గిరిజన మండలాలలో వ్యవసాయ దిగుబడులను పెంపొందించుటలో గిరి రైతులకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా ఆచార్య ఎన్ జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి చేస్తుండడం అభినందనీయమని పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుళ్ళీ భాగ్యలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఏర్పాటు చేసిన కిసాన్ మేలా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె ముందుగా కిసాన్ మేళాలో వివిధ వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ శాఖలు ఏర్పాటుచేసిన స్టాళ్ళను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ విశాఖ ఏజెన్సీలో గిరి రైతులు సాంప్రదాయ వ్యవసాయంతో సేంద్రీయ పంటలు పండిస్తున్నప్పటికీ కనీస మద్దతు ధరలు లభించక పోవడంతో తీవ్రంగా నష్టాలు చవి చూసే వారన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ గిరి రైతులు తనకున్న పరిజ్ఞానంతో వరి, చిరుధాన్యాలు, సాగును చేపట్టి సత్ఫలితాలు సాధించే వారన్నారు. వాటిని విక్రయించుకోవడంలో దళారులను నమ్మి తీవ్రంగా నష్టపోయే వారన్నారు. ఈ దశలో గిరి రైతులకు శాస్త్ర పరిజ్ఞానం అందించేందుకు ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1985లో విశాఖ జిల్లా చింతపల్లి కేంద్రంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాన్ని, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా సీతంపేట నందు, 1986లో విశాఖ జిల్లా రస్తా కుంటుబాయి నందు కృషి విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను యాంత్రీకరణ వైపు ప్రయాణించే విధంగా కృషి చేసిన శాస్త్రవేత్తలను ఆమె కొనియాడారు. విశాఖ ఏజెన్సీలోని 11 మండలాల్లోని శ్రీకాకుళం జిల్లాలో 7 గిరిజన మండలాలు అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం విజయనగరం జిల్లాలో 8 మండలాలకు అవసరమైన వ్యవసాయ పరిశోధన మరియు విస్తరణ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. మన్యంలో పండించే రాజ్ మాకు అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకు రావడం అభినందనీయమన్నారు. గిరిజన ప్రాంతాలకు అనుకూలమైన సేద్య పద్ధతులను అభివృద్ధి పరచడం మిశ్రమ వ్యవసాయ విధానాలను అభివృద్ధి చేయడం, సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను కొనసాగించడం అదేవిధంగా అధిక ఆదాయం ఇచ్చే ఇతర వాణిజ్య పంటలు పంటల సరళిపై పరిశోధనలు నిర్వహించి రైతులకు వాటి ఫలితాలను అందించడంలో శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. మన్యంలో సంప్రదాయ పంటలకు తోడు, సాంప్రదాయేతర పంటలైన స్ట్రాబెర్రీ, డ్రాగన్, సపోటా, ఎర్ర వరి, నల్లవారి, రెడ్ క్యాబేజీ, బ్రకోలి, తదితర విదేశీ పంటలను మన్యంలో గిరి రైతులు సేంద్రియ పద్ధతుల్లో సాగు చేపట్టేందుకు శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలితమేనని ఆమె కితాబిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన శాస్త్రవేత్తలు సీతంపేట నుంచి ఉదయ్ బాబు, విజయనగరం నుంచి వి హరి కుమార్, చింతపల్లి నుంచి దేశగిరి శేఖర్, ఎల్ సూర్యనారాయణ లకు ఆమె ప్రశంస పత్రం మెమొంటోలు ఇచ్చి సత్కరించారు. అదేవిధంగా అభ్యుదయ రైతులు ఎస్ సిమ్మయ్య, ఎస్ ఆనందరావు, పీ నీలకంఠం, టి సావిత్రమ్మ, జి దేముళ్ళు, టి లింగమూర్తి, టి శివ కేశవరావు, తదితరులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకవర్గం సభ్యులు పి దేముళ్ళు, ఏ.ఎస్.రావు, మోహన రావు, భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ కె శైలజ, ప్లాంట్ ప్రొటెక్షన్ సైంటిస్ట్ బీ నాగేంద్రప్రసాద్, గృహ విద్య విజ్ఞాన శాస్త్రవేత్త దివ్య సుధా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల 35 గిరిజన మండలాలు నుంచి వచ్చిన వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ శాస్త్రవేత్తలు ఆదర్శ, అభ్యుదయ రైతులు స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానం సిబ్బంది అధిక సంఖ్యలో గిరి రైతులు పాల్గొన్నారు.