ఈశాన్య ఢిల్లీలో ఇవాళ కూడా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు మిన్నంటాయి. ఇవాళ ఉదయం బ్రహ్మపురి ఏరియాలో రాళ్లు రువ్విన సంఘటన జరిగింది. ఆ ప్రాంతాన్ని రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూంబింగ్ చేస్తోంది. వరుసగా మూడవ రోజు కూడా అల్లర్లు చోటుచేసుకోవడంతో.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తమ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బ్రహ్మపురి ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న ఆర్ఏఎఫ్ దళాలకు.. వాడిన బుల్లెట్లు లభించాయి. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. ఢిల్లీ శాంతిభద్రతల అంశంపై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం జరిగిన హింసలో ఓ కానిస్టేబుల్‌తో సహా అయిదుగురు చనిపోయారు. అయితే మృతుల సంఖ్య ఏడుకు పెరిగినట్లు తెలుస్తోంది.
జఫ్రాబాద్, సీలంపూర్‌లో మహిళలు ధర్నా కొనసాగిస్తున్నారు. అక్కడ ఆరు వారాల నుంచి వాళ్లు సీఏఏకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈశాన్య ఢిల్లీలో పరిస్థితి అదుపులో ఉన్నట్లు డీపీసీ అమూల్య పట్నాయక్ తెలిపారు. అయిదు పింక్ లైన్ మెట్రో స్టేషన్లను ఇవాళ కూడా మూసివేశారు. ఢిల్లీ హింసను బాలీవుడ్ రచయిత జావెద్ అక్తర్ తన ట్విట్టర్‌లో ఖండించారు. ఢిల్లీలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నట్లు సీఎం కేజ్రీవాల్ కూడా ట్వీట్ చేశారు.