ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ బాధ్యతగా వ్యవహరించినప్పుడే.. పట్టణాల్లో మార్పు సాధ్యపడుతుందని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. కొత్త మున్సిపల్ చట్టంలో అనేక వెసులుబాట్లు కల్పించడంద్వారా ప్రభుత్వం ప్రజలపై ఎంతో విశ్వాసముంచిందని.. ఆ విశ్వాసాన్ని వమ్ముచెయ్యవద్దని కోరారు. ‘ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటినుంచి పద్ధతులు మార్చుకొందాం’ అని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎంత బాధ్యతగా పనిచేసినా.. ప్రతి పట్టణవాసి, ప్రజాప్రతినిధులు, అధికారుల్లో కూడా బాధ్యత పెరిగినప్పుడే సమగ్రాభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. పురపాలన అంటేనే పౌరుల భాగస్వామ్యంతో కూడిన పరిపాలన అని చెప్పారు. సీసా నీళ్లు తాగడం మానేసి.. మిషన్ భగీరథ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న స్వచ్ఛమైన మంచినీటిని తాగడం అలవాటుచేసుకోవాలని హితవుచెప్పారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టణప్రగతి కార్యక్రమం మంగళవారం రెండోరోజు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున కొనసాగింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయా పట్టణాలు, నగరాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ నల్లగొండ జిల్లా దేవరకొండ, నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. ‘ఇల్లు మాత్రమే నాది.. వీధి నాది కాదు.. రోడ్డు నాది కాదు.. పట్టణం నాది కాదు అనే భావన సరికాదు. మనమందరం మారి.. కలిసికట్టుగా పట్టణాన్ని అభివృద్ధిచేసుకోవాలి’ అని మంత్రి కేటీఆర్ చెప్పారు. పట్టణప్రగతి రెండోరోజు కార్యక్రమంలో భాగంగా ముందుగా నల్లగొండ జిల్లా దేవరకొండలో పర్యటించారు. హనుమాన్‌నగర్, అయ్యప్పనగర్‌లో దాదాపు రెండుగంటలపాటు కాలినడకన పర్యటించి కాలనీవాసులతో మాట్లాడారు. చాలాచోట్ల చెత్తచెదారం బాధ్యతారహితంగా వేసిఉండటాన్ని గమనించి శుభ్రంగా ఉంచుకోవాలని హితవుచెప్పారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగసభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తాను పట్టణంలో పర్యటించినప్పుడు చెత్త కుప్పలు కనిపించడాన్ని ప్రస్తావించారు. దేవరకొండ పట్టణాన్ని అభివృద్ధిచేసేందుకు ఎవరూ రారని.. ప్రజలే బాధ్యతగా తీసుకొని పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. వక్ఫ్ భూముల్లో పట్టాలు ఇప్పించాలని ప్రజలు కోరారని.. ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.
చెత్తను వేరుచేయాలి
తడి చెత్త, పొడి చెత్తపై ప్రజల్లో కనీస అవగాహనలేదని.. నాలుగైదు రోజుల్లో ఇంటికి రెండు బుట్టలు పంపిణీచేసి చెత్త సేకరణ పక్కాగా చేపట్టాలని కలెక్టర్‌ను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో చేపట్టిన తడి చెత్త, పొడి చెత్త విధానంతో నెలకు రూ.3 లక్షల ఆదాయం సమకూరుతున్నదని.. ఒకసారి ఆ విధానాన్ని పరిశీలించాలని మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లకు సూచించారు. శ్రమను గౌరవించే విధానం రావాలని.. ఇందుకోసం మున్సిపాలిటీల్లో పనిచేసే సఫాయి, మున్సిపల్ కార్మికుల పరిచయ కార్యక్రమం మొదలుపెట్టామని చెప్పారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్లుగానే.. రోడ్డు, వీధి, పట్టణం సైతం మనదేననే భావనతో అందరూ కలసికట్టుగా పట్టణాలను అభివృద్ధి చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. మనం మారుదాం.. మన పట్టణాన్ని మార్చుకుందామని అన్నారు. దేవరకొండలో వంద పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. వార్డు కమిటీ సభ్యులు వార్డు సభలు నిర్వహించాలని.. ప్రతి వార్డులో శానిటేషన్ ప్లాన్, గ్రీన్ యాక్షన్ ప్లాన్, వాటర్ ఆడిట్ ప్లాన్లను రూపొందించాలని వివరించారు.
మున్సిపాలిటీ బడ్జెట్‌లో పదిశాతం పచ్చదనంకోసం వెచ్చించాలని.. 85 శాతం మొక్కలు సంరక్షించకుంటే కౌన్సిలర్ల ఉద్యోగాలు పోతాయని హెచ్చరించారు. ఇంటి నిర్మాణం కోసం ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేదని స్పష్టంచేశారు. కొత్త చట్టం పౌరుల పక్షాన ఉంటుందని.. అతిక్రమించిన వారికి శిక్షలు సైతం అంతే కఠినంగా ఉంటాయని చెప్పారు. అభివృద్ధి కోసం ప్రజలంతా తమ తమ బాధ్యతలు నిర్వహించి ఆర్నెళ్లలో దేవరకొండ రూపురేఖలు మారిస్తేనే ఎమ్మెల్యే రవీందర్‌కుమార్ కోరిన సుమారు రూ.25 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరుచేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఖబ్రస్థాన్, ఖననవాటిక, వైకుంఠధామాలతోపాటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్, పార్కుల అభివృద్ధి, డంపింగ్‌యార్డ్ అభివృద్ధి వంటి పనులు చేపడతామని తెలిపారు. ఒక్కొక్క కౌన్సిలర్ ఒక్కో కేసీఆర్‌గా మారి తమ వార్డులను అభివృద్ధి చేయాలన్నారు. అంతకుముందు పట్టణంలో రూ.48 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు, సీసీ రోడ్ల నిర్మాణం, పార్క్ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనచేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రితోపాటు ఎమ్మెల్యే రవీందర్‌కుమార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సత్యనారాయణ, మండలి విప్ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, వైస్‌చైర్మన్ రహత్ అలీ పాల్గొన్నారు.
సీసా నీళ్లు తాగొద్దు
దేవరకొండ నుంచి కల్వకుర్తిలో జరిగిన పట్టణప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. రూ.2.70కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ సబ్‌స్టేషన్, రూ.50లక్షలతో చేపట్టనున్న వీధి దీపాల పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనచేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సీసా నీళ్లను తాగే దుస్థితిపోవాలని.. మిషన్ భగీరథ నీటిని తాగే అలవాటును చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.వేల కోట్లతో మిషన్ భగీరథ పథకాన్ని అమలుచేస్తున్నదని, ఆ నీటిని తాగడం ద్వారా ఆరోగ్య పరిరక్షణ సాధ్యపడుతుందని పేర్కొన్నారు. సమావేశంలో మాట్లాడుతూనే తనకు మంచినీళ్లు కావాలని కార్యకర్తలను అడుగటంతో వారు ప్లాస్టిక్ సీసాలో నీళ్లు తెచ్చిచ్చారు. ఈ విధంగా సీసానీళ్లు తాగడం మానేయాలని, భగీరథ నీటిని అలవర్చుకోవాలని సూచించారు. పల్లెప్రగతి స్ఫూర్తితో పట్టణాలను అభివృద్ధిచేసుకోవటానికి కదులుదామన్నారు. ఖాళీ స్థలాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా లేకుంటే సంబంధిత యజమానులకు నోటీసులు జారీచేయాలని అధికారులను ఆదేశించారు. పదిరోజుల్లో ప్రతివార్డుకూ హరితప్రణాళిక తయారుచేయాలని, మొత్తంబడ్జెట్‌లో 10 శాతం నిధులు హరిత ప్రణాళికకు కేటాయించాలని తెలిపారు.
కల్వకుర్తి పట్టణాన్ని రాబోయే నాలుగేండ్లలో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడంలో రాజకీయాలు, పార్టీలకతీతంగా అందరు కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. మిషన్ భగీరథ కింద నల్లా కనెక్షన్లు ఇవ్వనివారికి రాబోయే రెండుమూడు రోజుల్లో రూపాయికే ఇస్తామని మంత్రి తెలిపారు. వార్డులవారీగా వాటర్ ఆడిట్ రూపొందించాలని మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. నెల వ్యవధిలో 75 పబ్లి క్ టాయిలెట్లను నిర్మించాలని మున్సిపల్ చైర్మన్‌కు సూచించారు. అత్యాధునిక సౌకర్యాలతో సమీకృత మార్కెట్ నిర్మాణానికి స్థలం ఇస్తే వెంటనే చేపడ్తామన్నారు. వైకుంఠధామాలు, క్రీడాప్రాంగణాలు, పార్కులకు స్థలాలు ఇవ్వాలని సూచించారు. ఓపెన్ జిమ్‌లు ఏర్పాటుచేయాలని పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు ‘పరిచయం’ అనే కార్యక్రమం ద్వారా సఫాయి కార్మికులు, చెత్త బండి కార్మికుల మొబైల్ నంబర్లను గోడలకు పెయింట్ చేయిస్తామన్నారు. కాలనీలోని ప్రజలకు అందుబాటులోఉండేలా కౌన్సిలర్లు కార్యాలయాలు ప్రారంభించుకోవాలన్నారు.
పట్టణ, పల్లెల అబివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ అడిషనల్ కలెక్టర్లను నియమించినట్టు వివరించారు. తడి, పొడి చెత్తను ప్రత్యేకంగా సేకరించాలని, ఇందుకోసం రాబోయేకాలంలో వార్డు స్పెషల్ ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. జపాన్, సింగపూర్‌లలో రోడ్లపై చెత్తవేసే అలవాటు లేదన్నారు. రెండునెలలకు సరిపడా రాష్ట్రంలో అన్ని మున్సిపాల్టీలకు నిధులు మంజూరయ్యాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో శాసనసభ్యులు జైపాల్‌యాదవ్, మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జిల్లాపరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి, అడిషనల్ కలెక్టర్ మనుచౌదరి, జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ బాలాజిసింగ్, మాజీ ఎంపీ మందా జగన్నాథం, మాజీమంత్రి చిత్తరంజన్‌దాస్, మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి, మున్సిపల్ డైరెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు.
నాగమ్మా... నీ ఇంటికి చెత్తు వేయిస్తా..
వృద్ధురాలికి భరోసా ఇచ్చిన మంత్రి కేటీఆర్
దేవరకొండ, నమస్తేతెలంగాణ: రేకుల ఇల్లుతో తాను పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టిన ఓ వృద్ధురాలికి ఇంటికి చెత్తు (పై కప్పు) వేయిస్తానని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. పట్టణప్రగతిలో భాగంగా దేవరకొండ పట్టణంలోని తొమ్మిదోవార్డులో పర్యటించిన మంత్రికి, నాగమ్మ అనే వృద్ధురాలికి మధ్య జరిగిన సంభాషణ ఇదీ..
కేటీఆర్: అవ్వా నీ పేరేమిటి?
వృద్ధురాలు: పానగంటి నాగమ్మ సార్
పెన్షన్ వస్తున్నదా?
వృద్దురాలు: వస్తున్నది సార్
మిషన్ భగీరథ నల్లా వస్తున్నదా ?
వృద్దురాలు: వస్తున్నది సార్
చెత్త బండి వస్తున్నదా?
వృద్దురాలు: నిత్యం వస్తున్నది
చెత్త బుట్టలు ఉన్నాయా?
వృద్దురాలు: లేవు సార్
పంపిస్తాలే గాని.. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా?
వృద్దురాలు: ఒంటరిగా ఉంటున్నా.. రేకుల ఇల్లు కావడంతో వర్షాలకు, ఎండలకు ఇబ్బంది పడుతున్న. దయుంచి చెత్తు పోయించండి సార్
తప్పకుండా నీ ఇంటికి చెత్తు వేసేందుకు సాయం చేస్తా.