అరకు ఉత్సవాలను రద్దు చేయాలి- ఆదివాసి జేఏసి

విశాఖ ఏజెన్సీలో ఆదివాసీలు హక్కులు కోల్పోయి ఉద్యమాలతో రగిలిపోతుంటే ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని వెచ్చించి ఆరుకు ఉత్సవాలను నిర్వహించడం విడ్డురంగా ఉందని ఈ సందర్భంగా జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావు దొర ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా చింతపల్లి మండల కేంద్రంలో గల ఉద్యోగుల భవన్లో జేఏసీ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివాసేతరుల అక్రమ వలసల కారణంగా రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ద్వారా సంక్రమించిన ప్రత్యేక హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నాయని, విశాఖ ఏజెన్సీ అరకులోయ, అనంతగిరి, లంబసింగి వంటి ప్రాంతాల్లో అభివృద్ధి ముసుగులో ప్రవేశ పెడుతున్న టూరిజం ప్రాజెక్టుల వల్ల ఆదివాసేతరుల అక్రమ వలసలు/చొరబాట్లు పెరిగి స్థానిక ఆదిమజాతుల హక్కుల ఉల్లంఘన లేదా నిరాకరణ, 1/70 భూ బదలాయింపు నిషేధ చట్ట నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న భూపరాయికరణ జరుగుతుందని, ఆదివాసేతరుల అక్రమ కట్టడాలు, గుడారాల ముసుగులో వ్యభిచారం, మత్తు పదార్థాల వినియోగం వంటి అసాంఘిక కార్యకలాపాల వలన, హెచ్ఐవి/ ఎయిడ్స్, డెంగీ, ఆరోన వంటి సరికొత్త వ్యాధుల సంక్రమణకు టూరిజం ద్వారా సంక్రమిస్తూ, దాని విస్తృతికి కారణమవుతుందని, అంతేకాకుండా పాశ్చాత్య సంస్కృతులను బలవంతంగా ప్రవేశపెడుతూ, స్థానిక ఆదివాసీ తెగల సంస్కృతి, సాంప్రదాయక విలువలపై దాడులు అధికమై తెగల గుర్తింపు సైతం కోల్పోవలసి వస్తుందని అన్నారు. విశాఖ ఏజెన్సీలో ఆదివాసీ చట్టాల అమలు, హక్కుల పరిరక్షణకై ఆదివాసీ హక్కుల పరిరక్షణ సమితి సారథ్యంలో హక్కుల ఉల్లంఘనకు, గుడారాల (టూరిజం) ముసుగులో కొనసాగుతున్న వ్యభిచారం, భూ పరాయికరణలకు వ్యతిరేకంగా, కనీస అవసరాల సదుపాయాలు కల్పన కోసం ఆదివాసీలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్న సమయంలో కోట్లాది రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ అరుకు ఉత్సవాలు నిర్వహించడాన్ని ఆదివాసీ హక్కుల పరిరక్షణ సమితి  తీవ్రంగా వ్యరేతికస్తుందని, కావున ఈ నెల అనగా ఫిబ్రవరి 29, 2020 నుండి రెండు రోజులపాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన అరుకు ఉత్సవాలను రద్దు చేసుకోవాలని కోరుతున్నట్లుగా తెలిపారు. బలవంతంగా ఉత్సవాలు నిర్వహిస్తే అడ్డుకుంటామని, అలాగే గత రెండు నెలలుగా ఏజన్సీ ప్రాంతంలో గిరిజనులు తమ హక్కులను, చట్టాలను కోల్పోతున్నామని, ఉద్యమం చేస్తూ తిరుగుబాటు చేస్తుంటే, అదివాసి ప్రాంతంలో ఉద్యమాలు జరగడం లేదని ఆదివాసీ ప్రజాప్రతినిధులు ప్రకటనలు చేస్తూ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారని, ఆదివాసి జెఏసి ఇంత వరకు ఇచ్చిన వినతులను తీవ్రంగా పరిగణించి పరిష్కారించకుండా అరకు ఉత్సవాలు ఎట్లా నిర్వహిస్తారో చూస్తామని, మేం కూడా అంతే తీవ్రంగా ఉద్యమిస్తామని, ఏమైనా జరిగితే ఆదివాసీ ప్రజాప్రతినిధులు అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు, అరకు ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, పాల్గుణ బాధ్యులవుతారని ఈ సందర్భంగా తీవ్రంగా హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్ మొట్టడం రాజబాబు, మండల చైర్మన్ అడపా పరమేశ్వరరావు, మండల కో కన్వీనర్ మద్దెల శివప్రసాద్ జగత్ రాయ్ తదితరులు పాల్గొన్నారు.