విశాఖ ఎయిర్ పోర్టు వెలుపల రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు

  • చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన ఉద్రిక్తం

  • చంద్రబాబు కాన్వాయ్ కు అడ్డంగా పడుకున్న వైసీపీ కార్యకర్తలు

  • వాహనం దిగి నడిచి వెళ్లేందుకు ప్రయత్నించిన బాబు

  • భద్రతా కారణాలతో వారించిన పోలీసులు

  • మూడు గంటలుగా ఎయిర్ పోర్టు వద్దే నిలిచిపోయిన టీడీపీ అధినేత

  • ఎన్‌కౌంటర్ చేసినా యాత్ర చేసే తీరుతా -చంద్రబాబు


విశాఖ: ఉత్తరాంధ్రలో ప్రజా చైతన్య యాత్రను వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ దుర్మార్గంగా తన యాత్రను అడ్డుకుంటుంటే..  పోలీసులు దానికి వత్తాసు పలుకుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజల కష్టాలు వినేందుకు విశాఖలో పర్యటించి తీరుతానని చంద్రబాబు ప్రకటించారు. 


 


పోలీసులు అనుమతి ఉన్నా యాత్ర కూడా సాగని పరిస్థితి ఉందంటే... ఏపీలో పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతుందన్నారు. ‘‘ఇది శాంతి భద్రతల వైఫల్యం కాదా?, పోలీసులు ఏం సమాధానం చెబుతారు?, ఇవాళ ఎంత సమయమైనా..  విశాఖలో పర్యటన కొనసాగించి తీరుతా. ఎయిర్‌పోర్టు ముందు వైసీపీ గూండాలు గుమికూడితే.. ఏమీ చేయలేక పోలీసులు చేతులెత్తేస్తారా?, ఎట్టి పరిస్థితుల్లోనూ యాత్ర కొనసాగిస్తా. నన్ను ఎన్‌కౌంటర్ చేసినా వెనక్కి తగ్గను’’ అని చంద్రబాబు హెచ్చరించారు.


 


వైసీపీ నేతలు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పర్మిషన్‌ తీసుకున్నా అడ్డుకుంటున్నారన్నారు. వైసీపీ నేతలు డబ్బులిచ్చి మనుషుల్ని తీసుకొచ్చి.. మాపై కోడిగుడ్లు, చెప్పులు, రాళ్లు వేశారని ధ్వజమెత్తారు. విశాఖ ప్రశాంతమైన నగరం.. ప్రజలు శాంతి కోరుకుంటున్నారని తెలిపారు. ప్రశాంత విశాఖ నగరాన్ని అశాంతి మయం చేయాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు భూములు కబ్జా చేస్తున్నారు, దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


 


‘‘జనం కష్టాలు తెలుసుకునేందుకు వచ్చా.. నన్ను అడ్డుకుంటారా?, నన్ను ఏ చట్టం కింద వెళ్లిపోవాలంటున్నారు?, అరెస్ట్‌ చేయాలనుకుంటే నోటీసు ఇవ్వాలి. ఎమ్మెల్యేలను బెదిరించడం మంచి పద్ధతి కాదు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన నన్ను అడ్డుకున్నారంటే.. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి?, నేను జనంతో మాట్లాడితే వీళ్ల బండారం బయటపడుతుంది. వైసీపీ నేతల ప్యాంట్లు తడుస్తాయి. డబ్బులిచ్చి జనాల్ని తెచ్చి నాపై దాడి చేయాలని చూస్తున్నారు’’ అని చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.