ఢిల్లీలో జరిగిన అల్లర్ల గురించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సరైన రీతిలో స్పందించలేదని బెర్నీ సాండర్స్ అన్నారు. అమెరికా అధ్యక్ష పదవి కోసం డెమోక్రటిక్ పార్టీ తరపున రేసులో ఉన్న సాండర్స్.. ట్రంప్ భారత పర్యటనపై కామెంట్ చేశారు. మానవహక్కుల అంశంపై ట్రంప్ సరైన రీతిలో రియాక్ట్ కాలేదన్నారు. మంగళవారం రోజున ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. సీఏఏ భారత అంతర్గత అంశమని, దాని గురించి ప్రధాని మోదీతో చర్చించలేదని అన్నారు. అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలను నాయకత్వ వైఫల్యంగా పోల్చారు సాండర్స్. భారత్‌లో సుమారు 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారని, ఢిల్లీ అల్లర్లలో 27 మంది చనిపోయారని, దానిపై ట్రంప్ చేసిన కామెంట్.. ఆయన నాయకత్వ వైఫల్యాన్ని చూపుతున్నదని సాండర్స్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సీఏఏను పలువురు డెమోక్రాట్లు కూడా తీవ్రంగా తప్పుపట్టారు. దేశంలో చెలరేగుతున్న హింసకు ఆ చట్టమే కారణమన్నారు.