అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ మంగళవారం రాత్రి రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక విందును ఏర్పాటుచేశారు. రాష్ట్రపతి భవన్‌కు విచ్చేసిన ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి కోవింద్, ఆయన సతీమణి సవిత సాదర స్వాగతం పలికారు. విందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, ఆయన మంత్రివర్గ సహచరులు, తెలంగాణ, అసోం, కర్ణాటక, హర్యానా రాష్ర్టాల ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే, రక్షణ బలగాల అధిపతి జనరల్ బిపిన్ రావత్, విప్రో వ్యవస్థాపకులు అజిమ్ ప్రేమ్‌జీ, బ్యాంకర్ కొటక్ మహింద్రా, సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. దర్బార్ హాల్‌లోని ఐదో శతాబ్దంనాటి గౌతమ బుద్ధ విగ్రహం ఎదుట ట్రంప్ దంపతులు, కోవింద్ దంపతులు ఫొటోలు దిగారు.
అనంతరం ట్రంప్, కోవింద్ కొద్దిసేపు సమావేశమయ్యారు. భారత్‌కు అమెరికా విలువైన మిత్రదేశమని, ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్ అధిక ప్రాధాన్యమిస్తున్నదని కోవింద్ తెలిపారు. ట్రంప్ మాట్లాడుతూ.. రెండు రోజుల భారత పర్యటన ఫలప్రదంగా సాగిందని చెప్పారు. వాణిజ్య, రక్షణ ఒప్పందాలపై రెండు దేశాలు కసరత్తు చేస్తున్నాయని పేర్కొన్నారు. విందు సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. రెండు రోజుల పర్యటన అద్భుతంగా సాగిందని చెప్పారు. ‘ఈ రెండు రోజులు చాలా ప్రత్యేకం. ఐ లవ్ ఇండియా. ఐ లవ్ ఇండియన్స్. మేం మళ్లీ తిరిగి వస్తాం’ అని పేర్కొన్నారు. రాష్ట్రపతి కోవింద్ మాట్లాడుతూ.. భారత్‌కు అమెరికా సహజ భాగస్వామి అని చెప్పారు. దాదాపు 40 లక్షల మందికిపైగా భారతీయులు అమెరికాను తమ నివాసంగా చేసుకున్నారని, నవభారత విజన్‌కు, అమెరికన్ డ్రీమ్‌కు వారు వారధిలా ఉన్నారని చెప్పారు.