ఉగ్రవాదంపై పోరుకు కట్టుబడి ఉన్నాం
భారత్-పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధం
సంయుక్త మీడియా సమావేశంలో ట్రంప్
సీఏఏపై మోదీతో చర్చించలేదని వెల్లడి
మన మైత్రి ఈ శతాబ్దికే కీలకం: మోదీ
భారత్‌లో ముగిసిన ట్రంప్ పర్యటన
అమెరికాకు తిరుగు ప్రయాణం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: భారత్-అమెరికా మధ్య రక్షణబంధం మరింత బలోపేతమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో రెండోరోజైన మంగళవారం ఇరుదేశాల మధ్య దాదాపు రూ.21,549 కోట్ల విలువైన భారీ రక్షణ ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా అమెరికా అత్యాధునిక అపాచీ, ఎంహెచ్-60 రోమియో సైనిక హెలికాప్లర్లను, ఇతర ఆయుధ సామగ్రిని భారత్‌కు అందించనున్నది. దీంతోపాటు మరో మూడు ఎంవోయూలు కూడా కుదిరాయి. అంతకుముందు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ట్రంప్, మోదీ దాదాపు ఐదుగంటలకుపైగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉదయం ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు, ప్రధాని మోదీ సాదర స్వాగతం పలికారు. అనంతరం ట్రంప్ దంపతులు రాజ్‌ఘాట్‌లో గాంధీజీ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు. మెలానియా ట్రంప్ ఢిల్లీలోని సర్వోదయ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. అక్కడ బోధిస్తున్న ‘హ్యాపీ క్లాసెస్'ను చూసి ముగ్ధులయ్యారు. రాత్రి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్‌లో ఇచ్చిన ప్రత్యేక విందులో ట్రంప్ దంపతులు పాల్గొన్నారు. ఈ విందుకు ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
రక్షణ రంగంలో అమెరికా, భారత్ మధ్య బంధం మరింత బలోపేతమైంది. ఇరు దేశాల మధ్య 300 కోట్ల డాలర్ల (దాదాపు రూ.21,549 కోట్ల) ఒప్పందం కుదిరింది. దీంట్లో భాగంగా అత్యాధునిక అపాచీ, ఎంహెచ్-60 రోమియో హెలికాప్లర్లు, ఇతర ఆయుధ సామగ్రిని భారత్‌కు అమెరికా అందించనున్నది. దీంతోపాటు రెండు దేశాల మధ్య మరో మూడు అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూ) కుదిరాయి. మంగళవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శిఖరాగ్రస్థాయి చర్చలు జరిపారు. అనంతరం వారిద్దరూ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ అద్భుతమైన దేశమని, మోదీ గొప్ప నేత అని మరోమారు కొనియాడారు. భారత్‌లో తన రెండు రోజుల పర్యటన అద్భుతంగా సాగిందన్నారు. ‘మోతెరాలో నాకు గొప్ప గౌరవం దక్కింది. దాదాపు 1.25 లక్షల మంది ప్రజలు స్టేడియంలో ఉన్నారు. వారు నాకన్నా మిమ్మల్ని (మోదీ) చూడటానికే వచ్చారని భావిస్తున్నా. నేను మీ (మోదీ) పేరును ఉచ్ఛరించినప్పుడల్లా స్టేడియం హోరెత్తింది. ప్రజలు అంతలా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు’ అని మోదీతో ట్రంప్ అన్నారు. రెండు దేశాల మధ్య 300 కోట్ల డాలర్ల (దాదాపు రూ.21,549 కోట్ల) రక్షణ ఒప్పందం కుదిరిందని ట్రంప్ చెప్పారు. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అత్యాధునిక ఎంహెచ్-60 రోమియో, అపాచీ హెలికాప్టర్లు, ఆధునిక ఆయుధసామగ్రిని అందిస్తామని తెలిపారు. ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి పౌరులను రక్షించేందుకు రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని పునరుద్ఘాటించారు.
సమగ్ర వాణిజ్య ఒప్పందంపై దృష్టి
భారత్‌తో సమగ్ర వాణిజ్య ఒప్పందంపైనా దృష్టిసారించామని ట్రంప్ చెప్పారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలను విధిస్తుందని, ఈ విషయంలో పునరాలోచించాలని కోరారు. భారత్-అమెరికా మధ్య ఇప్పుడు దృఢమైన బంధం ఉన్నదని, అద్భుతమైన ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌కు అమెరికా ఎగుమతులు 60 శాతం మేర, ఇంధన రంగ ఎగుమతులు 500 శాతం మేర పెరిగినట్టు చెప్పారు. వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు భారత్‌లో ‘అమెరికా అంతర్జాతీయ ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ’ శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటుచేయబోతున్నట్టు ప్రకటించారు. అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ మధ్య సంబంధాల పునరుద్ధరణపై మోదీతో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు.
మోదీ మతస్వేచ్ఛ కోరుకుంటున్నారు
భారత్‌లో మతస్వేచ్ఛపై మోదీతో చర్చించానని ట్రంప్ తెలిపారు. ‘మా చర్చల సందర్భంగా మతస్వేచ్ఛ గురించి మాట్లాడుకున్నాం. దేశంలోని ప్రజలందరికీ మతస్వేచ్ఛ ఉండాలని మోదీ కోరుకుంటున్నారు. తమ ప్రభుత్వం ముస్లింలతో సన్నిహితంగా పనిచేస్తున్నదని ఆయన చెప్పారు. ఒకసారి గతాన్ని పరిశీలిస్తే మత స్వేచ్ఛ గురించి భారత్ ఎంతో పోరాడింది’ అని ట్రంప్ పేర్కొన్నారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారడంపై చర్చించారా అన్న విలేకరుల ప్రశ్నకు స్పందిస్తూ.. ‘ఇది భారత అంతర్గత విషయం. దీని గురించి మాట్లాడను’ అని చెప్పారు. ప్రజల కోసం ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ‘ఎలాంటి వివాదాస్పద అంశాలపైనా స్పందించదలుచుకోలేదు. ఒక్క జవాబుతో నా రెండు రోజుల పర్యటన, రెండు రోజుల ప్రయాణాన్ని వ్యర్థం చేయలేను. ఏదైనా మాట్లాడితే మీరు నా పర్యటన గురించి పూర్తిగా పక్కన పెట్టేస్తారు’ అని వ్యాఖ్యానించారు. తాలిబన్లతో కుదుర్చుకోనున్న శాంతి ఒప్పందంపైనా మోదీతో చర్చించానన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు రష్యా ప్రయయత్నిస్తున్నదన్న ఆరోపణలను ట్రంప్ తోసిపుచ్చారు. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి తనకు అలాంటి సమాచారం ఏమీ లేదన్నారు.
కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహిస్తా
కశ్మీర్ అంశం భారత్-పాకిస్థాన్ మధ్య అతిపెద్ద సమస్యగా మారిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇది ఎంతోమంది ప్రజలను వేధిస్తున్నదని చెప్పారు. ఈ అంశంపై అవసరమైతే మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని పునరుద్ఘాటించారు. మోదీతో చర్చల సందర్భంగా పాకిస్థాన్ అంశం కూడా వచ్చిందని తెలిపారు. ‘నాకు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని నియంత్రించడానికి వారు చర్యలు చేపట్టారు’ అని పేర్కొన్నారు.