ఇండియన్‌ 2 షూటింగ్‌ ప్రమాదంతో మేల్కొంటున్న నిర్మాతలు

భారీ బడ్జెట్‌తో చిత్రాలని నిర్మిస్తున్న నిర్మాతలు.. టెక్నీషియన్స్‌ విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నారనేది సగటు ప్రశ్నగా మారింది. లొకేషన్స్‌లో ప్రమాదాలు జరగడం, వాటి వలన ప్రాణాలు కోల్పోవడం గతంలో చాలానే జరిగాయి. రీసెంట్‌గా ఇండియన్ 2 చిత్ర షూటింగ్‌లో చోటు చేసుకున్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు కన్నుమూయడం ప్రతి ఒక్కరిని బాధించింది. ప్రమాదంలో మృతి చెందిన వారితో పాటు గాయపడ్డ వారికి కూడా కమల్‌ కోటి రూపాయల పారితోషికాన్ని ప్రకటించి  పెద్ద మనసు చాటుకున్నారు.


ఇండియన్ 2 షూటింగ్‌ ప్రమాదంతో మేల్కొన్న నిర్మాతలు సినిమా లొకేషన్స్‌లో పలు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కార్మికులకి భీమా చేయిస్తున్నారు. తాజాగా శింబు నటిస్తున్న మానాడు నిర్మాత సురేష్‌ కామాక్షి తన సినిమా కోసం పని చేసే కార్మికుల కోసం రూ. 30 కోట్లతో భీమా చేయించారని తెలుస్తుంది. ఇందుకోసం ప్రీమియంగా రూ. 7.8 లక్షలు చెల్లించారని చిత్ర బృందం పేర్కొంది. కార్మికుల సంక్షేమం కోసం నిర్మాత ఇంత ముందు చూపు చేయడంపై  పలువురు  హర్షం వ్యక్తం చేస్తున్నారు.